
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ అక్రమ కోడి పందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో “స్కై ఐ – ప్రకాశం పోలీస్ ప్రాజెక్ట్” కింద పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మలపాడు, పులేవరి వరిపాలెం గ్రామాలు మరియు వాటి చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రోన్ పర్యవేక్షణలో, అటవీ ప్రాంతాలు, దూర ప్రాంతాలు మరియు గుర్తించబడిన సమస్యాత్మక ప్రాంతాల్లో అక్రమ కోడి పందాలు, జూద కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని గమనించారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. కోడి పందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటం, నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధునిక పోలీసింగ్ విధానాలతో నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని, ప్రజలు అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
