
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా, అనధికార హై బీమ్ లైట్లు మరియు ఇతర ప్రమాదకర లైటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ప్రభుత్వ ప్రమాణాలకు విరుద్ధంగా అధిక కాంతి వెలువరించే లైట్లు వాడటం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులకు దృష్టి మసకబారడం, ప్రమాదాల అవకాశాలు పెరగడం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, అనధికార లైటింగ్‌ను తొలగించారు.ఇలాంటి మార్పులు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండటమే కాకుండా చట్టపరమైన చర్యలకు కారణమవుతాయని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.హెల్మెట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడం, రాత్రివేళల్లో లో బీమ్ వినియోగించడం వంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.