
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి
ఉలవపాడులో ఆకస్మికంగా హాస్టల్ తనిఖీ
ఎందుకిలా చేస్తున్నారంటూ సిబ్బందిపై ఆగ్రహం
మరోసారి తప్పు జరిగితే చర్యలు తప్పవని వార్నింగ్
తొలి శుభోదయం ఉలవపాడు:-
ఎమ్మెల్యే సార్ ! మా హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదు. చాలీచాలకుండా పెడుతున్నారు. మా వార్డెన్, మెనూ పట్టించుకోవడం లేదు. ఒకసారి మాట్లాడండి సార్… అంటూ ఉలవపాడు లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఉలవపాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వెళ్లారు. జడ్పీ హైస్కూల్లో సభ అనంతరం, విద్యార్థులు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు … పిల్లలను వెంటబెట్టుకుని పక్కనే ఉన్న హాస్టల్ లోకి హఠాత్తుగా వెళ్లారు. పిల్లల ముందే వార్డెన్, వంట మనిషిని నిలదీశారు. మెనూ సరిగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని, అయినప్పటికీ మార్పు రాలేదని సీరియస్ అయ్యారు. ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను, మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే ఊరుకునేది లేదు. చర్యలు కఠినంగా ఉంటాయి అంటూ హాస్టల్ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పిల్లలు ఎమ్మెల్యే స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే హాస్టల్ ను ఎమ్మెల్యే నాగేశ్వరావు సందర్శించగా, స్లాబ్ ఉరుస్తున్న సంగతిని పిల్లలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, స్లాబును బాగు చేయించారు. మంగళవారం హాస్టల్ పరిశీలనలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు.
