
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ కింద కందుకూరు పట్టణం మరియు లింగసముద్రం మండలం పేదపావని గ్రామ పరిధిలో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ శ్రీ బాల సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో, కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టాయి. ఈ బృందాలలో కందుకూరు టౌన్ ఎస్సై నాగరాజు, కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణ, వలేటివారిపాలెం ఎస్సై మరిడి నాయుడు, లింగసముద్రం ఎస్సై రాంబాబు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇళ్లు, దుకాణాలు, పాత నేరస్తుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించగా, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమానితులను ఆధునిక మొబైల్ చెక్ డివైస్లతో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని, వాటికి బానిసైతే ఆర్థికంగా మరియు కుటుంబపరంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. మత్తు పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించడంతో పాటు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అలాగే ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకూడదని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పే మోసగాళ్లను నమ్మకూడదని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉన్నవారు వెంటనే 112కు కాల్ చేయడం లేదా 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వడం, లేక సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడం కోరారు. ప్రజల సహకారంతో సురక్షితమైన, నేరరహిత, మత్తు లేని సమాజ నిర్మాణానికి ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు.
