
తొలి శుభోదయం న్యూస్ కంభం :-
మార్కాపురం జిల్లా కంభం మండలం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే అరుదైన వ్యక్తుల్లో ఉపాధ్యాయుడు వేణుగోపాలాచారి ముందు వరుసలో నిలిచి ఉంటాడని కంభం మండలం ఎంఈవో టి.శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మండలంలోని ఎల్ కోట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు వేణుగోపాలాచారిని, కాంప్లెక్స్ చైర్మన్ గని.వెంకటేశ్వర్లు , ఎంఈవో శ్రీనివాసులు , ఉపాద్యాయులు, సిఆర్పీలు శనివారం ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుడు వేణుగోపాలాచారి విద్యా సేవలను గుర్తుచేస్తూ,సొంత నిధులతో బోధనోపకరణాలను రూపొందించి విద్యార్థులతో మమేకమయ్యే మంచితనం ఆయన సొంతం అంటూ కొనియాడారు.పనిచేస్తున్న పాఠశాలకు, విద్యార్థులకు చేయూతనివ్వడంతో బాటు,సహోద్యోగుల సమస్యలపై స్పందించే తీరును కొనియాడారు. వేసవి నేపధ్యంలో విద్యావనరుల కేంద్రం వేడెక్కి 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతను చేరిన వైనాన్ని గమనించిన సదరు ఉపాద్యాయుడు, 10 వేల రూపాయల సొంత ఖర్చులు వెచ్చించి కూల్ సిమెంట్ వేయించడం ద్వారా విద్యా కేంద్రాన్ని చల్లబరచి, తీవ్ర వేడికి ఉపశమనంగా ఉద్యోగులకు ఊరట కల్పించడం వేణుగోపాలాచారి వ్యక్తిత్వానికి నిదర్శనమంటూ అభినందించారు. సేవలు సహాయ సహకారాలను అందించడమే గాక సమాజానికి స్ఫూర్తిగా ఉంటాయని ప్రశంసించారు.