
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రజల ఆర్థిక భద్రత పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని పలు ఏటీఎంలను సందర్శించి భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏటీఎంల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేశారు.ఏటీఎంలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎలాంటి అలసత్వం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు గార్డులకు సూచించారు. అలాగే ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి, లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.ఏటీఎం కార్డ్ మార్పిడి మోసాలు, స్కిమ్మింగ్, నగదు చోరీలు వంటి నేరాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు ఎంతో ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే డయల్ 112 / 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.