
28.5 లక్షలతో నిర్మించిన CC రోడ్డు, డ్రైనేజీ ప్రారంభం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నట్లు కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని దివి శివలింగప్రసాద్ ఇంటి వద్ద నుంచి తాళ్లూరి రమణయ్య ఇంటి వరకు 28.5 లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు, సిసి డ్రైన్ ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు వార్డు అధ్యక్షుడు కొచ్చర్ల తనూజ్ ఆధ్వర్యంలో స్థానికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు కనిపించాయని చెప్పారు. గత ఎన్నికల ప్రచార సమయంలో కూడా స్థానికులు ఈ రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కందుకూరు పర్యటనకు వచ్చినప్పుడు, మున్సిపాలిటీ గురించి ఆయనకు వివరించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సీఎంగారు, 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే 20 కోట్ల నిధులు మున్సిపాలిటీకి విడుదల కాగా, వాటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించారు. గత ఎన్నికల్లో కందుకూరు మున్సిపాలిటీ ప్రజలు తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన విషయాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనని ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కందుకూరు అభివృద్ధికి గురించి అడిగినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో నిధులు ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారం మరువలేనిదని చెబుతూ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇద్దరి సహకారంతో మునిసిపాలిటీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, రాబోయే రోజుల్లో కందుకూరును నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కే.అనూష, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, పార్టీ సీనియర్ నేతలు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, వార్డు అధ్యక్షుడు కొచ్చర్ల తనూజ్, స్థానిక నేతలు బెల్లం వెంకటేశ్వర్లు, వడ్డేళ్ల వెంకట్రావు, కొడాలి శ్రీధర్, చుండూరి మాల్యాద్రి, నల్లూరి సింగయ్య, దివి శ్రీను, రావి జాలయ్య, రాయి రాము, అత్తోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
