
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ శుక్రవారం కొండపి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ రికార్డులు, విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు, కేసుల పురోగతి, సీసీటీఎన్ఎస్ నమోదు, ఫిర్యాదుల స్వీకరణ విధానం తదితర అంశాలను డీఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.స్టేషన్లోని రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించి, నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా నిర్వహించాలని డీఎస్పీ అధికారులకు సూచించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా ప్రతి కేసును గంభీరంగా తీసుకొని విచారణ చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని ఆదేశించారు.ఈ సందర్భంగా కొండపి సీఐ తో పాటు పోలీస్ సిబ్బందితో పరస్పర సంభాషణ నిర్వహించిన డీఎస్పీ , విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలని, స్టేషన్ పరిధిలో నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎస్పీ సూచించారు.