
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి, ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీకి ఈరోజు (మార్చి 31)తో గడువు ముగియనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు వెల్లడించారు.
ఏళ్లుగా పేరుకుపోయిన పన్ను బకాయిలపై వడ్డీలో సగం రాయితీ పొందాలంటే, పాత బకాయిలతో పాటు ప్రస్తుత సంవత్సర పన్నును ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గడువు అనంతరం పూర్తి వడ్డీతోనే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది కూడా పన్నుల వసూళ్లకు సిద్ధంగా ఉన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలు తమ వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని, పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజలు చెల్లించే పన్నులు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించబడతాయని తెలిపారు.ముఖ్య సూచన: ఈరోజు (మార్చి 31)లోపు పన్నులు చెల్లించి 50% వడ్డీ రాయితీని తప్పక వినియోగించుకోండి.