
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రకాశం పోలీసులు ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పొన్నలూరు, ఉలవపాడు, మర్రిపూడి, తాళ్ళూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో డ్వాక్రా మహిళా సంఘాలు, VROలు, VOAలు, ఈ-నారి సిబ్బందితో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు సైబర్ నేరాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ప్రొఫైల్స్, ఫ్రాడ్ మెసేజ్‌లు, OTP మోసాలు, ఆన్లైన్ చీటింగ్‌లకు ఎలా గురికాకుండా ఉండాలో వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.అదేవిధంగా మహిళలపై జరిగే నేరాలు, POCSO చట్టం, పిల్లల భద్రతపై అవగాహన కల్పిస్తూ, బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ప్రోత్సహించారు. శక్తి యాప్ (Sakthi App) వినియోగం, అత్యవసర సమయంలో అందుబాటులో ఉన్న భద్రతా సేవల గురించి వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ అవసరం, అధిక వేగం ప్రమాదాలపై చైతన్యం కల్పించారు. అలాగే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించి, యువతను డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో నేరాలపై అప్రమత్తత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.