
భారతదేశ చేనేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పట్టేలా చేనేత మేళ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు చేయూత నివ్వండి.
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు నగరంలోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత ఎగ్జిబిషన్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మికులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంలోని మంగళగిరి, ఉప్పాడ, బాపట్ల, చీరాల, శ్రీకాళహస్తి మరియు వెంకటగిరి ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ రాష్టానికి చెందిన గద్వాల, నారాయణపురంతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి వచ్చిన విభిన్న చేనేత ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టానికి మరియు నైపుణ్యానికి ప్రతిరూపమైన ఈ వస్త్రాలు అత్యంత నాణ్యతతో ఉన్నాయని కొనియాడారు. ప్రజలందరూ ఈ ప్రదర్శనను సందర్శించి తమకు నచ్చిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఎగ్జిబిషన్ లో దేశ నలుమూలల నుండి వచ్చిన చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత ఎగ్జిబిషన్ జిల్లా హ్యాండ్ లూమ్ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
