
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే సంకల్పంతో ప్రకాశం జిల్లా పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద విస్తృత స్థాయిలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు నిలిపివేసి, వారికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలు, ప్రాణ నష్టం ఎలా జరుగుతుందో ఉదాహరణలతో వివరించారు. హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడే అత్యంత ముఖ్యమైన రక్షణ సాధనమని పోలీసులు స్పష్టంగా తెలియజేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, హెల్మెట్ లేకుండా పట్టుబడిన ప్రతి ద్విచక్ర వాహనదారుడితో ఇకపై ఎప్పుడూ హెల్మెట్ ధరించి వాహనం నడుపుతామని, తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కూడా హెల్మెట్ ధరించేందుకు ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఒకేచోట పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీసులతో కలిసి హెల్మెట్ భద్రతపై ప్రతిజ్ఞ చేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య గారు,హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అవగాహనతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
