
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ స్వయంప్రతిపత్తి కళాశాల, కందుకూరు నందు నేడు అనగా 7-3 - 2026 న మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ ఎం. రవి కుమార్, టి ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ఎందరో మహిళలు అత్యున్నత స్థానాల్లో సేవలు అందిస్తున్నారని, ఉన్నత పదవులను సాధించి ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. టి ఆర్ ఆర్ కళాశాలలో విద్యనభ్యసించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ,బెంగళూరు నందు పనిచేస్తున్న ప్రొఫెసర్ గాలి మాధవి లత, చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మించడంలో 17 సంవత్సరాల పాటు శ్రమించారని, వంతెన నిర్మాణంలో కీలక పాత్ర వహించిన ఘనత ఆమెది అని తెలియజేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కందుకూరు మునిసిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష మాట్లాడుతూ మహిళల పరిస్థితులు ఇంకా ఎన్నో విషయాల్లో మెరుగుపడవలసి ఉందని, మనం ఇక ముందు మహిళా దినోత్సవాలు కాకుండా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి వచ్చి మహిళా సాధికారత వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ఆంగ్ల అధ్యాపకులు మరియు ఐక్యుఏసి కోఆర్డినేటర్ పి. రాజగోపాల్ బాబు మాట్లాడుతూ వాలెంటీనా తెరిష్కోవా, మేడం క్యూరీ, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి స్త్రీలను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకు నడవాలని ఉద్ఘాటించారు. రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయిన డాక్టర్ కె.వి. పద్మావతి మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం ఇంటి నుండే మొదలవ్వాలని తెలియజేశారు. మహిళా సాధికారత విభాగం కన్వీనర్ కొమ్మనబోయిన సుజాత మాట్లాడుతూ ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది అని గురజాడ వారన్న మాటను నిజం చేస్తూ స్త్రీల పరిస్థితులు కొంతవరకు మెరుగుపడినప్పటికిని ఇంకా ఎన్నో విషయాల్లో మార్పులు రావాల్సి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు, అకెడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. వి.శ్రీహరి తదితర అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే తయారు చేయబడిన బొమ్మలను, హస్తకళాకృతులను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష , అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు తిలకించారు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత విభాగానికి షేక్ షానాజ్ బేగం మహిళా సాధికారత విభాగమని పేరు పెట్టడం జరిగింది. కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా సేవలందించిన షేక్ షానాజ్ బేగం 2025 ఆగస్టులో స్వర్గస్తులైనారు. స్వర్గీయ షేక్ షానాజ్ బేగంచేసిన సేవలను పురస్కరించుకుని వారి గౌరవార్థం మహిళా సాధికారత విభాగానికి వారి పేరు పెట్టడం జరిగింది.
