
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్థానిక టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో శనివారం జాతీయ సేవా పథకం (NSS) విభాగం ఆధ్వర్యంలో "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా, కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడం మరియు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవికుమార్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ, "జీరో లిట్టర్ గవర్నెన్స్" (చెత్త రహిత పరిపాలన) అనే ఇతివృత్తంతో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజు చేసే పని కాదని, అది మన జీవనశైలిలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులు కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, కళాశాల మైదానంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. విద్యార్థులు పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ కళాశాల ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్-1 కో-ఆర్డినేటర్ కె. నరేష్ రాజా, ఫిజికల్ డైరెక్టర్ కె. కరుణ రత్న కుమార్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహం, వారి క్రమశిక్షణ కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛత పట్ల వారికున్న అంకితభావాన్ని చాటిచెప్పింది.
