
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరిచి, ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో కనిగిరి డీఎస్పీ (SDPO) గారు తర్లుపాడు పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్ర వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నమోదైన వివిధ కేసుల ప్రగతిని, ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) లో ఉన్న కేసుల స్థితిగతులను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా, నాణ్యమైన దర్యాప్తుతో ముగించాలని, ఈ విషయంలో ఏమాత్రం జాప్యం సహించబోమని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ నిర్వహణలో భాగంగా రిజిస్టర్లు, కేసు డైరీలు మరియు అధికారిక రికార్డులను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని, రికార్డుల పారదర్శకతపైనే పోలీస్ శాఖ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కేసుల దర్యాప్తుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కనిగిరి డీఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలకు తక్షణమే స్పందించి పరిష్కారం చూపడం ద్వారా ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని కోరారు. ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణ, నిబద్ధత మరియు బాధ్యతతో పనిచేసినప్పుడే ఉత్తమ పోలీసింగ్ సాధ్యమవుతుందని, నేర నియంత్రణలో తర్లుపాడు స్టేషన్ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.