
తొలి శుభోదయం ఉలవపాడు :-
అమెరికాలో నివాసం ఉంటున్న నవి ర్యాన్ జెల్డీ పుట్టినరోజు సందర్భంగా,తన తాతయ్య విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రాల ఇస్సాక్ రాజ భూషణం మానవీయ విలువలను ప్రతిబింబించే సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉలవపాడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రక్కన నివాసం ఉంటున్న చిన్నారుల ఆరోగ్యం, పోషణను దృష్టిలో ఉంచుకుని వారికి పౌష్టికాహారం మరియు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో పిల్లల ఆరోగ్యం, విద్య కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులో సరైన పోషకాహారం అందితే వారు ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. పుట్టినరోజులను ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
న్యాయవాది పిల్లలకు స్వయంగా పండ్లు, పౌష్టికాహారాన్ని అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
నిర్వాహకులు మాట్లాడుతూ, నవి ర్యాన్ జెల్డీ పుట్టినరోజును సేవా దృక్పథంతో నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు, ఫ్రెండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొని నవి ర్యాన్ జెల్డీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన ఈ సేవా కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.
