
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండేపి సీఐ సోమశేఖర్ గురువారం సర్కిల్ ఆఫీస్లో సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్స్పెక్టర్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి, చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ, నిందితుల పర్యవేక్షణ, రౌడీ షీటర్ల కదలికలు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా వంటి అంశాలను సవివరంగా సమీక్షించారు. ప్రజల భద్రత, సామాజిక శాంతి, నేరాల నివారణ కోసం ఇప్పటికే చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా సీఐ సోమశేఖర్ మాట్లాడుతూ, ప్రతి ఎస్ఐ తన పరిధిలో నేరాల్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలతో మమేకమై పోలీస్ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. రాత్రి పహారా, పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సేకరణ వంటి విధులను నిరంతరంగా కొనసాగించాలని ఆయన సూచించారు. రాబోయే పండుగలు, సమావేశాలు, ప్రజా కార్యక్రమాల సందర్భంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు సజావుగా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు మరియు తమ తమ ప్రాంతాల్లో నేర నియంత్రణ, ప్రజా భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై వివరాలు వెల్లడించారు.