
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజలను నేరాల నుంచి రక్షించడం మరియు చట్టాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మోటుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ మరియు అనుమానాస్పద పార్సెల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, పార్సెల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు. మరోవైపు, గిద్దలూరు పట్టణంలో యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించడంతో పాటు, అక్రమ రవాణాకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యల గురించి హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.