
పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యాలి.
తాగునీరు, పారిశుధ్యం వైద్య సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్ రాజ బాబు విద్యాశాఖ అధికారులకు ఆదేశం.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ,పర్యవేక్షణ లో ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా పోలీస్ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ,ట్రాన్స్పోర్ట్ శాఖ, విద్యుత్, పోస్టల్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇతర శాఖల అధికారుల తో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజ బాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సి వి రేణుక వివరిస్తూ ఈనెల 16 వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, కేటాయించిన కేంద్రాలు, తదితర వివరాలను ఆమె వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజ బాబు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి వీటిపై దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎస్పీ హర్షవర్ధన రాజు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలకు సమీపంలో పరీక్ష జరిగే గంట ముందు నుండి జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ బి.చిన ఓబులేసు, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాధరావు, ఏపీ సీ పీ డీ సీ ఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, డి టి సి సుశీల, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణి కుమార్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పదిమంది బాలికలు పరీక్షలు రాస్తారన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తారన్నారు . ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలు లోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందన్నారు.
