
చంద్రబాబు సంకల్పం ఫలించింది… టిడ్కో ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగు
తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:-
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం పరిధి లో తలారువానిపాలెంలో టిడ్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విశాఖపట్నం ఇంచార్జ్ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు మరియు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. ఈ సందర్భంగా గాజువాకలో 1393 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. గతేడాది తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, ఇప్పుడు రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా గత 21 నెలల కాలంలోనే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ పనితీరు, సంకల్పబలం స్పష్టంచేస్తోందన్నారు.2019 నాటికే పూర్తయిన ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసి, కేవలం రంగులు మార్చే పేరుతో సుమారు రూ.300 కోట్లు దుర్వినియోగం చేసిందని పల్లా ఆరోపించారు. మౌలిక వసతులు కల్పించకుండా, సిమెంట్ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, ఎస్టీపీ వంటి అవసరాలను పట్టించుకోకుండా ఇళ్లను ఖాళీగా ఉంచడం వైసీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులను మభ్యపెట్టి ఇళ్లను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు సమీకరించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి గృహాలకు జీవం పోసిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యంతో పేదల గృహ కలను సాకారం చేస్తోందన్నారు. సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగే పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మరింత వేగంతో గృహ నిర్మాణం, పంపిణీ కార్యక్రమాలను విస్తరిస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.