
తొలి శుభోదయం ప్రకాశం :-
కొండేపి మండలంలోని చోడవరం, వెన్నూరు, చిన్న వెంకన్నపాలెం, ముప్పవరం గ్రామాల రైతులు అలాగే టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామానికి చెందిన రైతులు చోడవరం గ్రామం సమీపంలోని మూసి వాగు వద్ద పొగాకు నారుమడులు వేసుకున్నారు. వీటికి కాపలా, పనుల నిమిత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి సుమారు 121 మంది కూలీలను తీసుకువచ్చి అక్కడ చిన్నచిన్న గుడారాలు వేసి నివాసం ఏర్పాటు చేశారు.అయితే, రైతులు నారుమడులు దెబ్బతింటాయని ఆందోళనతో కూలీలను అక్కడే ఉండమని చెప్పడంతో వారు తాత్కాలిక గుడారాల్లోనే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల ప్రాంతంలో పైప్రాంతాల నుండి భారీ వరద నీరు రావడంతో, పల్లపు ప్రాంతాల్లోని కూలీల నివాసాలు నీటమునిగాయి. పరిస్థితిని గమనించిన వెంటనే కూలీలు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోయారు.విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్డిఆర్ఎఫ్ (SDRF)బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షాప్రయత్నాలు ప్రారంభించాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, వరద నీటిలో చిక్కుకున్న 121 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు.అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఇలాంటి సమాచారం గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ రిస్కు ఆపరేషన్లో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, కొండేపి సీఐ సోమశేఖర్, కొండేపి ఎస్ఐ ప్రేమ్ కుమార్, పొన్నలూరు ఎస్సై అనుక్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ అధికారులు, మరియు ఇతర అధికారులు కీలకంగా వ్యవహరించారు.
