
తొలి శుభోదయం ప్రకాశం:-
పొన్నలూరు మండల కేంద్రానికి సమీపంలోని గ్రామ శివారు పొలాల్లో అక్రమంగా పేకాట ఆడుతున్న వ్యక్తులపై పొన్నలూరు ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ. 7,320 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదం మరియు పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, ఎక్కడైనా చట్టవిరుద్ధ పనులు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.