
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పిల్లల భద్రతను పరిరక్షించడం, బాలలపై జరుగుతున్న నేరాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో Good Touch – Bad Touch అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మరియు చిన్నారులకు Good Touch – Bad Touch అంటే ఏమిటి, అనుచిత ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ఎలాంటి పరిస్థితుల్లో భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలనే విషయాలపై వివరించారు. పిల్లలపై జరిగే వివిధ రకాల నేరాలు, లైంగిక వేధింపుల పట్ల జాగ్రత్తలు, ఆత్మరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే, POCSO చట్టం (Protection of Children from Sexual Offences Act) గురించి వివరించి, ఈ చట్టం ద్వారా పిల్లలకు కల్పించబడిన రక్షణ, నేరానికి పాల్పడిన వారిపై తీసుకునే కఠిన చర్యల గురించి తెలియజేశారు. పిల్లల భద్రత విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉందో, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, పిల్లలు సమాజ భవిష్యత్ అని, వారి భద్రత, హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎటువంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, భయపడకుండా ముందుకు రావాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ దిశగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.