
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్లలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా విధులు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలపై నిఘా ఉంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులను విచారించి, సామాన్లు, బ్యాగ్‌లను పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ప్రయాణికులతో మాట్లాడి భద్రతాపరమైన సూచనలు చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.ఈ తనిఖీల ద్వారా నేరాలను ముందస్తుగా అడ్డుకోవడంతో పాటు, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగేందుకు ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.