
సీతారాముల మహనీయ జీవన విధానం అందరికీ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం:జిల్లా ఎస్పీ
జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., దంపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య సాంప్రదాయబద్ధంగా మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి , ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు , సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయ కుమార్ , ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ. షేక్ రియాజ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది మరియు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కళ్యాణం కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాకుండా ధర్మం, న్యాయం, ప్రేమ, కర్తవ్యనిర్వహణ వంటి ఉన్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని, శ్రీరాముడు ఆచరించిన జీవన విధానం పరిపూర్ణ మానవ జీవితానికి ఆదర్శప్రాయమని, సీతారాముల జీవిత చరిత్ర ప్రజలందరికీ మార్గదర్శకమని తెలిపారు. కరుణ, దయ, నీతి, చిత్తశుద్ధి, ప్రేమ, ధర్మం, సత్యం వంటి విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి పండుగను ప్రతి ఇంటా సుఖశాంతులతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ దంపతుల చేతుల మీదుగా భక్తులకు, ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దేవాలయాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసినట్లు, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, భక్తులు భక్తి శ్రద్ధలతో క్యూ లైన్ లు పాటిస్తూ ప్రతి ఒక్కరు దైవ దర్శనం చేసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ యం.రమణ దీక్షితులు, యం.దక్షణా మూర్తి, శ్రీ సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.
