
తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:-
ప్రజల ఆరోగ్య చిహ్నంగా, యోగా గుర్తుగా యోగాంధ్ర మెమోరియల్ నిలవనుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలోని వార్డు నెం.21లో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్‌ను మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు క్రమశిక్షణతో అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఆ సహకారమే విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ బోర్డు వంటి కార్యక్రమాల విజయానికి మూలకారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి సందర్శించిన ఈ ప్రాంతానికి గుర్తుగా విక్టరీ ఎట్ సీ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నౌకాదళం శౌర్య గాథలను భావితరాలకు స్పూర్తినిచ్చేలా, అలాగే ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ మెమోరియల్ ఏర్పాటుతో యోగా విలేజ్ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు సుందరమైన విశ్రాంతి వాతావరణం అందుబాటులోకి రానుందన్నారు.జీవీఎంసీ ఆధ్వర్యంలో స్థానిక యోగా విలేజ్ సమీపంలో సుమారు రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ నిర్మాణం చేపట్టారు. పింక్ శాండ్ స్టోన్‌తో మెమోరియల్ నిర్మాణంతో పాటు విగ్రహం ఏర్పాటు, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జైపూర్ శాండ్ స్టోన్‌తో 2505 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లోరింగ్, జోధ్‌పూర్ శాండ్ స్టోన్‌తో శిల్ప నిర్మాణం, కార్పెట్ గడ్డితో ల్యాండ్‌స్కేపింగ్, ఫోకస్ లైటింగ్ ఏర్పాటు వంటి పనులు నిర్వహించారు. ఈ పనులకు జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి వ్యయం చేయగా, ఎం/ఎస్ సెవెన్ హిల్స్ అసోసియేట్స్ సంస్థ పనులను చేపట్టింది. కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీలు రమణ మూర్తి, సత్యవేణి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పద్మనాభం ప్రాంతానికి చెందిన యోగా విద్యార్థిని సీహెచ్ శిరీషా యోగాసనాలు వేశారు. అతిథులంతా ఆమెను సత్కరించారు
