
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో భాగంగా ఏటీఎంల పరిసర ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల పని తీరు తదితర అంశాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఏటీఎంల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఏటీఎంలలో లేదా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎలాంటి అలసత్వం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు, స్కిమ్మింగ్, నగదు చోరీలు వంటి నేరాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు ఎంతో దోహదపడతాయని అధికారులు తెలిపారు. అలాగే ఏటీఎంల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి, లోపాలు ఉన్న చోట వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.ప్రజలు కూడా ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పిన్ నంబర్ గోప్యంగా ఉంచాలని, ఎలాంటి అనుమానాస్పద విషయాలు గమనించినా వెంటనే డయల్ 112 / 100కు సమాచారం అందించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.