
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 41 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను మార్కాపురం జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను బాధితులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకోని త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, వారితో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని సిబ్బందికి తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, పామూరు సీఐ శ్రీనివాసరావు, త్రిపురాంతకం సీఐ అస్సన్ , మార్కాపురం టౌన్ ఎస్సైలు సైదుబాబు, రూరల్ ఎస్సై వేమన మరియు సిబ్బంది పాల్గొన్నారు.
