
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ప్రయాణికులు ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ప్రయాణాలు సాగించేందుకు, నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ తనిఖీల సందర్భంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి భద్రతపై భరోసా కల్పించడంతో పాటు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించారు.రాత్రి మరియు రద్దీ సమయాల్లో నేరాలు జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేస్తూ ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజా ప్రదేశాల్లో పోలీసుల ఉనికి పెరగడం వల్ల నేరస్తుల్లో భయభ్రాంతులు ఏర్పడుతాయని, ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని పేర్కొన్నారు.శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.