
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు గారి అధ్వర్యంలో ఒంగోలు టు టౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్ మరియు 7 మంది ఎస్సైలు , 50 మంది పోలీస్ సిబ్బంది కొత్తపట్నంలోని మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పత్రాలు లేని 26 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమానితులను మొబైల్ చెక్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిస అయితే వ్యక్తి ఆర్థికంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి తన చర్యలపై నియంత్రణ కోల్పోయి అనేక అనర్థాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
అలాగే క్రికెట్ ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్లలో పాల్గొని లక్షల రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారని, యువత వీటి నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి మోసాలు చేసే వ్యక్తులు సమాజంలో పెరుగుతున్నారని, అలాంటి వారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా కొత్తపట్నంలోని గంగమ్మ కాలనీ పాలెం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.
