
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి….
తొలి శుభోదయం టంగుటూరు:-
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, విబిజి రాంజీ పేరుతో తెచ్చిన కొత్త చట్టం రద్దు చేయాలని, కార్మిక కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం నియంతృత్వ పాలన నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెలో కష్టజీవులంతా పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండలంలోని కొనిజేడు, మర్లపాడు, కందులూరు, మల్లవరప్పాడు సూరారెడ్డిపాలెం, నాయుడుపాలెం, బాపూజీ కాలనీ, టంగుటూరు, జమ్ములపాలెం తదితర గ్రామాలలో కూలీల వద్ద సమ్మెకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి, పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకార్మిక వర్గం అనేక శతాబ్దాల పాటు సమరశీల పోరాటాలు చేసి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4కోడ్లు గా మార్చి నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. ఫలితంగా కార్మిక వర్గం తమ హక్కులు నిలబెట్టుకునే శక్తిని కోల్పోతారని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రకృతి వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నదని అన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేస్తున్నదని వాటి రక్షణ కోసం కార్మిక వర్గం జాతీయ సమ్మెకు పూనుకున్నదని తెలిపారు. మరొకవైపు కనీస మద్దతు ధరల చట్టం కావాలని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలని పోరాటాలు చేస్తున్న రైతు సంఘాలు కలిసి కార్మిక కర్షక ఐక్యతతో ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండా అమెరికా నుంచి వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు దిగుమతులు చేసుకోవడం ద్వారా భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలవుతాయని తెలిపారు. పేదలకు ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దుచేసి పేదల పొట్ట కొట్టేలా కొత్త చట్టాన్ని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడుతుందని అన్నారు. 40% రాష్ట్రాలు వాటా భరించ లేకపోతే ఉపాధి హామీ చట్టం అమలు జరిగే అవకాశం ఉండదని అన్నారు. కరువు కాలంలో కష్టజీవులకు కాస్త కడుపు నింపే చట్టంగా ఉన్నదాన్ని మోడీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మార్చటాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజస్ మాట్లాడుతూ ఉపాధి చట్టానికి నిధులు పెంచకుండా 125 రోజులకు పని దినాలు పెంచామని ప్రజల్ని మోసపుచ్చటం దుర్మార్గమన్నారు. పాత చట్టం పునరుద్ధరించాలని, ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, కనీస వేతనం 600కు పెంచాలని, కొత్త చట్టం రద్దు చేయాలని ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో యావన్మంది ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.కె మీరాస్, యం. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.