
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల టౌన్ హాల్లో 'ఫోరం ఫర్ బెటర్ బాపట్ల' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ జనగణన సహాయక కేంద్రాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ స్వీయ జనగణన అవకాశం ద్వారా ప్రజలు తమ కుటుంబ మరియు గృహ వివరాలను వాలంటీర్ల సహాయంతో ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సౌకర్యం ఈనెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.
ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఈసారి ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని, ఆ ప్రక్రియలో ప్రజలకు తోడ్పాటునందించేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాల ఎదురుగా ఉన్న టౌన్ హాల్లో ఈ కేంద్రం శనివారం నుండి గురువారం వరకు పని చేస్తుంది. ప్రజలు ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల మధ్య తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురజాల శ్రీనివాస రావు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు ఆదినారాయణ, పవన్, గోపి, బాబు, శంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.