
– సంతపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్టడీ చైర్స్ పంపిణీ
తొలి శుభోదయం

విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ కీ. శే.బండి కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా, అమెరికాలో నివసిస్తున్న ఆయన మనవడు బండి శివతేజ బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంతపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు స్టడీ చైర్స్ మరియు రైటింగ్ పాడ్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా కోర్టు గౌరవ సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ తన ప్రసంగంలో మాట్లాడుతూ,
“బాలికల విద్య అనేది కేవలం వ్యక్తిగత పురోగతికే పరిమితం కాదు; అది సమాజ నైతిక, సామాజిక మరియు మేధో అభివృద్ధికి మౌలిక ఆధారం. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం విద్యావంతమవుతుంది; ఒక కుటుంబం విద్యావంతమైతే సమాజం బలపడుతుంది. అందువల్ల బాలికల విద్యను ప్రోత్సహించడం ప్రతి పౌరుని బాధ్యత” అని స్పష్టంగా పేర్కొన్నారు.ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ చదువుతున్న విద్యార్థినులు కష్టాలను అడ్డంకులుగా కాక, అవకాశాలుగా మార్చుకోవాలి అని సూచించారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థినుల భవిష్యత్తు ఈ దశలోనే నిర్ణయమవుతుందని, లక్ష్య నిర్ధారణతో పాటు క్రమశిక్షణ, శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించవచ్చని అన్నారు.
బండి కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన మనవడు బండి శివతేజ బాలికల విద్య కోసం ఈ విధమైన సేవా కార్యక్రమం చేపట్టడం విలువలతో కూడిన స్మరణీయ సేవగా అభివర్ణించారు. విదేశాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ మాతృదేశంలోని వెనుకబడిన విద్యార్థినుల అభ్యున్నతికి చేయూతనివ్వడం సమాజానికి ఆదర్శప్రాయమైన ఆలోచన అని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు సమన్వయంతో నిర్వహించడాన్ని ప్రశంసిస్తూ, సామాజిక బాధ్యతను వ్యక్తిగత స్థాయిలో ఆచరణలోకి తీసుకొస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్జిగారు అన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా విద్యారంగానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమం హాస్టల్ వార్డెన్ తాటితోటి ధనలక్ష్మి పాల్గొన్నారు
