
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పాకలపల్లెపాలెం, అలగాయపాలెం, రామయ్యపట్నం బీచ్‌లకు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రామయ్యపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (మెరైన్) ఇన్స్పెక్టర్ జి. శివన్నారాయణ కీలక భద్రతా మార్గదర్శకాలు జారీ చేశారు. పండుగ రోజుల్లో బీచ్‌లకు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో ఎక్కువసేపు గడపకుండా ఒడ్డున మాత్రమే స్నానం చేయాలని, లోతులోకి వెళ్లడం ప్రాణాంతకమని తెలిపారు. సముద్రపు అలలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తీరం నుండి లోపలికి లాగే బలమైన ప్రవాహాలు (Rip Currents) ఉంటాయని, ఇటీవలి తుఫాన్ల వల్ల తీరంలో ప్రమాదకర గుంటలు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరమని సూచించారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, యువత ఒంటరిగా లేదా పెద్దలకు తెలియకుండా బీచ్‌లకు వెళ్లవద్దని, పోలీసులు లేని బీచ్‌లకు వెళ్ళవద్దని హెచ్చరించారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ప్రమాదకరంగా ప్రవర్తించకూడదని, విలువైన వస్తువులు, బంగారు నగలు తీసుకురాక పోవడం మంచిదని తెలిపారు. మద్యం సేవించి బీచ్‌లకు రావడం ప్రమాదకరమని, అలా వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చీకటి పడిన తరువాత నీటిలోకి వెళ్లరాదని, సాయంత్రం 6 గంటల లోపు బీచ్‌ను విడిచిపెట్టాలని, రాత్రి సమయాల్లో బీచ్‌లలో గడపడం భద్రతా పరంగా మంచిది కాదన్నారు. ఈత రాని వారిని బలవంతంగా నీటిలోకి పంప వద్దని, ఎరుపు జెండాలు, హెచ్చరిక బోర్డులు మరియు పోలీస్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత ఏడాది కనుమ పండుగ రోజున పాకలపల్లెపాలెం బీచ్‌లో జరిగిన విషాద సంఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతూ, ప్రతి కుటుంబం సురక్షితంగా ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలంటూ ఇన్స్పెక్టర్ శివన్నారాయణ విజ్ఞప్తి చేశారు.