
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు మరియు పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ANMs, ఆశా వర్కర్లు మరియు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మహిళలపై నేరాలు, POCSO చట్టం, సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత మరియు గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా ఎస్ఎన్ పాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది కురిచేడు ప్రాంతంలో మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ పార్క్ వద్ద కూడా మహిళల భద్రతపై ప్రత్యేక చైతన్య కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాలలో మహిళలు, పిల్లలు భయపడకుండా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ మోసాల నుండి ఎలా రక్షించుకోవాలో, రోడ్డు భద్రతా నియమాలు ఎలా పాటించాలో వివరించారు.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులతో కలిసి పనిచేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.