
తొలి శుభోదయం కందుకూరు:-
ప్రముఖ పుణ్యక్షేత్రం, వలేటివారిపాలెం మండలం మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సౌజన్య, కుమారులు అవినాష్, సందీప్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోశాలకు వెళ్లి గోవులకు పండ్లు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, భక్తులకు ప్రసాదం వడ్డించారు. పదార్థాల నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాన సత్రం పరిశుభ్రంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలని, భక్తులకు ఇబ్బంది కలగకూడదని అధికారులకు సూచించారు. అమ్మవారి కొండపై నుంచి దిగివచ్చే మెట్లు మార్గంలో అనుమతి లేకుండా తినుబండారాలు అమ్ముతుండడాన్ని ఎమ్మెల్యే గమనించి, వాటిని అక్కడి నుంచి తొలగించాలని ఈవోను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మండల ఆలయ ఈవో చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, కందుకూరు పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, ప్రగడ నరసింహం, పరిటాల భాస్కర్, చుండి అక్కయ్య, కామినేని అశోక్ తదితరులు ఉన్నారు.
