
మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ పై సమీక్ష చేసిన ఎమ్మెల్యే
ఇకనుంచి ఉదయాన్నే వార్డుల్లో పర్యటిస్తా - నాగేశ్వరరావు
తీరు మారకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగం పనితీరు సరిగాలేదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందిపై పర్యవేక్షణ కూడా సరిగా లేదన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి ఆకస్మికంగా వెళ్లిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు… కమిషనర్ అనూషతోపాటు శానిటేషన్ సూపర్వైజర్లు, మేస్త్రిలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం సరిగాలేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొన్నిచోట్ల రోజుల తరబడి కాలువల్లో చెత్తను క్లియర్ చేయడం లేదని, మరికొన్నిచోట్ల తూతూమంత్రంగా పనిచేస్తుండడం వల్ల దుర్వాసన వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ అలాంటి పరిస్థితి ఉందో, వార్డుల వారీగా ఆయన వివరించారు. కమిషనర్ ఒక్కరే సక్రమంగా పనిచేస్తే సరిపోదని, సిబ్బంది మొత్తం బాధ్యతతో పనిచేసినప్పుడే శుభ్రమైన వాతావరణం ఏర్పడి ప్రజల హర్షిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ముందుగా చెత్త పేరుకుపోయే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. దుకాణదారులు, తోపుడుబండ్ల వ్యాపారులు రాత్రిపూట చెత్తను రోడ్లు, సైడ్ కాలవల్లో ఇష్టానుసారంగా వేస్తున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటివారికి పారిశుధ్యంపై ఎందుకు అవగాహన కల్పించడం లేదని కమిషనర్ ను ప్రశ్నించారు. వారందరికీ అవగాహన కల్పించాలని, అప్పటికి మార్పు రాకపోతే జరిమానాలు విధించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే పారిశుధ్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే, వారిని వెంటనే తొలగించాలని కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. మరో వారం రోజుల్లో మున్సిపాలిటీలో పరిస్థితి చక్కబడాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. వారం తర్వాత ప్రతిరోజూ ఉదయాన్నే తాను కూడా స్వయంగా వార్డుల్లో పర్యటనకు వస్తానని చెప్పారు.