
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణభద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సిబ్బందితో కలిసి, మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-16 పై హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, హెల్మెట్ వలన ప్రాణాలు ఎలా రక్షించబడతాయో వివరించారు. అలాగే, రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీలకు రేడియం స్టిక్కర్లను అమర్చారు, తద్వారా వాహనాలు దూరం నుంచే స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాలపై ప్రతిబింబించే రేడియం స్టిక్కర్ల వినియోగం రోడ్డు భద్రతకు అత్యంత కీలకమని వివరించారు.ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించవచ్చని, సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా, రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా కొనసాగిస్తారని తెలిపారు.