
గారు
తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ గారు
ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు
మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన అనంతరం, తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి, తుపాను సహాయక చర్యలు మరియు భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ (Dial 100 / 112) 24/7 పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను అత్యంత శ్రద్ధతో ఆలకించి తక్షణమే స్పందించాలని ఎస్పీ గారు ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా వచ్చే లైవ్ ఫీడ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి, ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
తీర ప్రాంత భద్రత దృష్ట్యా జిల్లాలోని పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ గారు, వారు నిర్వహించాల్సిన విధులు, సమన్వయ విధానాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు సజావుగా సాగేలాగా చూడాలని సూచించారు.
లైఫ్ జాకెట్లు, రోపులు, కట్టర్లు, జెసిబీలు, క్రేన్లు, ట్రాక్టర్లు వంటి సామగ్రిని పోలీసులు తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలను కలసి తుపాను పరిస్థితులపై అవగాహన కల్పించి, ప్రభుత్వం సూచించే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
అదేవిధంగా వాగులు, కాలువలు, చప్టాలు, నదులు ఉప్పొంగి ప్రవహించే సందర్భాల్లో కరకట్టలు తెగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలుల వలన స్తంభాలు, చెట్లు విరిగి రహదారులు అడ్డంకులు కలిగిస్తే, వాటిని తొలగించి ట్రాఫిక్ సవ్యంగా కొనసాగించేందుకు డోజర్లు, జెసిబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి హ్యాండ్ మైకులు సిద్ధం చేశారు. విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని జిల్లా ప్రజలకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ఎస్పీ గారు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ గారు వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.
