
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఈనెల 25వ తేదీన దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావానిపల్లి, కొత్తూరు గ్రామాల్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. ఈనెల 25వ తేదీన దోర్నాల మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఎలాంటి లోపాలు లేకుండా సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కొత్తూరులోని హెలిప్యాడ్ ప్రదేశం, సభ వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్ మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ వీఐపీల వాహనాల రాక,సభా వేదిక ఏర్పాటు ప్రదేశం, పార్కింగ్ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్టు ఎస్.సి అభుత్ ఆలీ, మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, వై.పాలెం ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ఇ.ఇ సుబ్బారెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
