
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కార్ ప్రయాణికులు సీట్ బెల్ట్ వాడటం, అధిక వేగం మానుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని స్పష్టంగా అవగాహన కల్పించారు. రోడ్డు నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావాలను ఉదాహరణలతో వివరించారు.రోడ్ సేఫ్టీ వారియర్స్ కూడా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని తెలిపారు. పోలీసులతో కలిసి వారు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన పొందింది.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు తన బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అవసరమైన చోట చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.