
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ,ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి మరియు హైవే అప్రోచ్ రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా రహదారులపై సరైన వెలుతురు (ఇల్యూమినేషన్), హెచ్చరిక బోర్డులు (సైన్‌బోర్డులు), సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు భద్రతకు అవసరమైన ఇతర మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణమే అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచనలు ఇచ్చారు.జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాద రహిత ప్రయాణం కల్పించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాద నివారణలో సీసీటీవీ కెమెరాలు, స్పష్టమైన రోడ్డు సూచికలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.రోడ్డు భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు, అవగాహన చర్యలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.