
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లావ్యాప్తంగా లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్ హౌస్లు మరియు లాడ్జింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ తనిఖీలలో భాగంగా లాడ్జిల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, వారి గుర్తింపు పత్రాలు (ID proofs), రిజిస్టర్ ఎంట్రీలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లో పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంలో నిర్లక్ష్యం వంటి లోపాలు ఉన్న యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, లాడ్జిలు మరియు హోటళ్లలో బస చేసే ప్రతి వ్యక్తి వివరాలను సక్రమంగా నమోదు చేయడం తప్పనిసరి అని, సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలలో భాగంగా ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, జిల్లాలో నేరాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.