
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపు…
తొలి శుభోదయం కొండేపి:-
వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. మండలంలోని అనకర్లపూడి, నెన్నూరుపాడు, మూగ చింతల, చవటపాలెం, పెట్లూరు, తాటాకుల పాలెం, పోలిరెడ్డి పాలెం, మొక్కోడి పాలెం, కొండేపి తదితర గ్రామాలలో శనివారం సమ్మె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు అనేక ప్రాంతాల్లో పొగాకు బ్యార్నీల వద్ద పనిచేస్తున్న రైతు కూలీలతో మాట్లాడారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ రైతుల ఆత్మహత్యలు రెట్టింపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడతానని చెప్పి మరింత సంక్షోభంలోకి నడుతున్నారని అన్నారు. గత బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన 37 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి 58 వేల కోట్లు, సాంఘిక సంక్షేమానికి పదివేల కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని అన్నారు. అందువలనే యూరియా దొరకక గడిచిన సీజన్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని అన్నారు. ఈ బడ్జెట్లో ఎరువులు సబ్సిడీ 16 వేల కోట్లు తగ్గించారని అన్నారు. కనీస మద్దతు ధరల చట్టం కోసం ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు కనపడలేదని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, అధిక ధరలు, గ్రామీణ అభివృద్ధి లాంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అనుమాత్రం కూడా పట్టించుకోవట్లేదని అన్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి పేదల పొట్టగొట్టే వి బి జి రామ్ జి కొత్త చట్టం తెచ్చిందని అన్నారు. కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను 4 కోడ్లుగా కుదించారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కేజీ మస్తాన్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా గ్రామ సీమల అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు గ్రామీణ పేదలంతా కరువు పని మీద ఆధారపడి జీవిస్తారని అన్నారు. అటువంటి చట్టాన్ని మరింత విస్తరించి ఏడాదికి 200 రోజుల పని దినాలు, కనీస వేతన 600 కి పెంచాలని కోరుతుంటే అసలుకే మోసం చేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహారం ఉన్నదని అన్నారు. ఉపాధి పాత చట్టం పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను గ్రామీణ పేదలంతా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.