
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
గృహ దొంగతనం కేసులో నిందితుడికి సింగరాయకొండ కోర్టు ఒక సంవత్సరం సాదా కారాగార శిక్ష విధించింది. సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.ములగుంటపాడు గ్రామంలోని వెంకటేశ్వర కాలనీలో నివసించే జంపని ఆంజనేయ రాజు (64) సంక్రాంతి సందర్భంగా చెన్నైకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టబడి ఉండటం గమనించారు. ఇనుప బీరువా తాళాలు విరగ్గొట్టి సుమారు 6 సావరిన్ బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు అపహరించబడినట్లు ఫిర్యాదు చేయడంతో 2025 జనవరి 26న కేసు నమోదు అయింది. మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.2.30 లక్షలు.దర్యాప్తులో ఖమ్మం పట్టణానికి చెందిన సంపతి ఉమా ప్రసాద్ ఉమా (24)ను అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువవడంతో భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్లు 331(4), 305(a), 317(2) కింద దోషిగా తేల్చి, ఏడాది సాదా కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఈ కేసులో ఎస్.ఐ. బి. మహేంద్ర దర్యాప్తు నిర్వహించగా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి. వరకుమారి వాదనలు వినిపించారు.