
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ కోడి పందేలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో Sky Eye Prakasam Project లో భాగంగా ఆధునిక డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగిస్తూ పోలీసు బృందాలు నిరంతర గస్తీ చేపడుతున్నాయి.ఈ క్రమంలో దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది, దొండపాడు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల ప్రాంతాల్లో డ్రోన్ బీట్ నిర్వహించి, కోడి పందేలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ప్రాంతాలను గుర్తించి అప్రమత్త చర్యలు చేపట్టారు.డ్రోన్ కెమెరాల ద్వారా పొలాలు, చెరువుల ప్రాంతాలు, ఒంటరి ప్రాంతాలను పర్యవేక్షించి, కోడి పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడ ఉన్న వారిని హెచ్చరించి తరిమివేశారు.ప్రజలు అక్రమ కోడి పందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అలాంటి సమాచారాన్ని పోలీసులకు అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
