google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ పట్టణంలోని ఏ.ఆర్.సి. & జి.వి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కత్తి కిరణ్ తన అసాధారణ ప్రతిభతో అమరావతిలోని ప్రతిష్ఠాత్మక విట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీటు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మరియు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడని కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సౌజన్య తెలిపారు.ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఎం.పి.సి. విభాగానికి చెందిన కత్తి కిరణ్ 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. అతని ఈ ప్రతిభను గుర్తించిన విట్ అమరావతి యాజమాన్యం అతనికి ఉచిత ఇంజనీరింగ్ సీటును కేటాయించింది.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన కిరణ్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, పట్టుదలతో చదివి ఈ ఘనతను సాధించడం విశేషమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలో అందుతున్న నాణ్యమైన బోధన, అధ్యాపకుల మార్గదర్శకత్వం, విద్యార్థి కృషి కలిసివచ్చి ఈ విజయాన్ని సాధించాయని ఆమె తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి విట్ వంటి జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఉచిత సీటు సాధించడం వరుసగా మూడోసారి కావడం కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అధ్యాపకులు మాట్లాడుతూ, కిరణ్ విజయం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ అత్యుత్తమ విద్య అందుతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి నాణ్యమైన ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సౌజన్య, అధ్యాపకులు, విద్యార్థులు కత్తి కిరణ్‌ను ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.