google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని పకీర్‌పాలెం అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా దీర్ఘకాలం సేవలందించిన కరీమున్నిషా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సైదాబీ మాట్లాడుతూ, కరీమున్నిషా ఎంతో నిబద్ధత కలిగిన కార్యకర్త అని, విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సెక్టార్‌లోని కార్యకర్తలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారని తెలిపారు. సెక్టార్ మీటింగ్స్‌లో కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేసేవారని పేర్కొన్నారు.
మరో సూపర్వైజర్ భారతి మాట్లాడుతూ, తాను కూడా గతంలో కార్యకర్తగా పనిచేశానని, అప్పటి నుంచే కరీమున్నిషాతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. పదవీ విరమణ ప్రతి ఒక్కరికీ సహజమని, అయితే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కలిగే ఆత్మసంతృప్తి ఎంతో గొప్పదని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సేవలందించాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు ప్రీ-స్కూల్ విద్య ద్వారా చిన్నారులకు విద్యా పునాది వేస్తారని, ప్రాథమిక విద్యకు బాటలు వేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
సభాధ్యక్షులుగా వ్యవహరించిన అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యలో గుణాత్మక అభివృద్ధికి కారణమవుతున్నారని అన్నారు. కరీమున్నిషా గత 42 సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు అందించి, మండలంలో గొప్ప కార్యకర్తగా, యూనియన్ నాయకురాలిగా ఎన్నో పోరాటాలు చేసి కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేశారని, ఎందరో బాలల భవిష్యత్తును తీర్చిదిద్దారని అభినందించారు.
ఈ సందర్భంగా కరీమున్నిషాను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, స్థానిక నాయకులు షేక్ రఫీ, డిల్లు సుభాని, ఫాజిల్, సందానీ, కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.