google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారి-16పై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) వద్ద వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజుతో కలిసి ప్రమాదాలకు గురవుతున్న ELF రన్‌వే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. పరిశీలన సందర్భంగా ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, డీటీసీ సుశీల్, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, కనుమళ్ల గ్రామం మరియు సింగరాయకొండ మధ్య ప్రజలు నిత్యం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు, నిత్యావసర అవసరాల కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ఈ రహదారిని దాటాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.ELF రన్‌వే కావడంతో అండర్‌పాస్ నిర్మాణం వంటి కొన్ని పరిష్కారాలకు సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ పరిష్కారాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న కొన్ని అండర్‌పాస్‌లను పునరుద్ధరించడం, ఆమోదం పొందిన సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, శాశ్వత పనులు పూర్తయ్యే వరకు తాత్కాలిక రహదారి సదుపాయాలు కల్పించడం, ప్రమాద ప్రాంతానికి ఇరువైపులా అలర్ట్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.అలాగే వాహనాల వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, రహదారి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే నేషనల్ హైవే అధికారులకు సూచనలు ఇచ్చినట్లు, త్వరలోనే క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.గత కొంతకాలంగా ELF రన్‌వేపై జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రజా ప్రయోజన వ్యాజ్యదారుడు సాంబ చెన్నంశెట్టి 2019 నుంచి 2026 వరకు జరిగిన ప్రమాదాలు, మరణాలు, గాయాలు, భద్రతా లోపాలు, ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల అభిప్రాయాలు, అధికారుల పరిశీలనలు తదితర అంశాలతో కూడిన 40 పేజీల సమగ్ర నివేదికను సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వైమానిక దళ అధికారులు, ఎన్హెచ్ఏఐ, జిల్లా యంత్రాంగం సహా 21 మంది కీలక అధికారులకు పంపించారు.అదే విధంగా హరి చెన్నంశెట్టి కూడా జిల్లా కలెక్టర్‌కు నేరుగా వినతిపత్రం అందజేసి ELF రన్‌వేపై జరుగుతున్న ప్రమాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి తరుపున వచ్చిన విజ్ఞప్తులు, నివేదికలు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించడంతోనే ఈ స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించబడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవల వరకు ప్రమాదాలకు నిలయంగా మారిన ELF రన్‌వే ప్రాంతంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలన నిర్వహించడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇకనైనా అధికారులు ప్రకటించిన చర్యలు వేగంగా అమలై, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా శాశ్వత పరిష్కారం లభించాలని సింగరాయకొండ ప్రజలు కోరుతున్నారు.