
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టమైన చక్రస్నానం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది.స్వామివారి సుదర్శన చక్రానికి వేద మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర తీర్థంలో అభిషేకం నిర్వహించి చక్రస్నాన మహోత్సవాన్ని జరిపారు. అనంతరం భక్తులు కూడా తీర్థస్నానం ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందారు.చక్రస్నానం ద్వారా పాపాలు నశించి, శారీరక-మానసిక శుద్ధి కలుగుతుందని, సకల శుభాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్ని ఉత్సవాలకు ఫలసిద్ధి కలిగించే మహోత్సవంగా చక్రస్నానాన్ని భావిస్తారు.వేలాది మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారి దివ్య కృపాకటాక్షాలను పొందారు.చక్రస్నానంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.